-
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: పర్యావరణ పరిరక్షణకు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ అత్యంత అవశ్యమని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా సాగితే స్వచ్ఛమైన పరిసరాలతో ప్రజల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రతి చోట కూడా ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయపద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కార్పొరేషన్ పదో డివిజన్ బోడుప్పల్ లోని మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఏరోబిన్స్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ (శానిటేషన్) రఘుప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఏరోబిన్స ద్వారా తడి వ్యర్థాలను 45 నుంచి 50 రోజుల వ్యవధిలో సేంద్రియ ఎరువు (కంపోస్ట్) గా మార్చవచ్చునని తెలిపారు. ఒక్కో ఏరోబిన్ సామర్థ్యంలో 300 లీటర్ల మేరకు ఉంటుందని, నివాసితుల నుంచి సేకరించిన తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. స్వచ్ఛమైన పరిసరాల కోసం ప్రతి గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో ఇలాంటి వ్యవస్థను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్త, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్, అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్ తో పాటు, మై విల్లాస్ నివాసితులు పాల్గొన్నారు.









