పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కేసుకు సంబంధించి పలు తీర్పులు వచ్చినప్పటికీ అవి తనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదన్నారు. దర్యాప్తులో కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపించారు. న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని, ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సునీత స్పష్టం చేశారు.



