నేతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. సిద్ధవటం మండలం మాధవరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. చేనేతల చైతన్య నేస్తం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాజంపేట, సుండుపల్లిలో సదస్సులు నిర్వహించామని, శుక్రవారం రాజంపేటలో జరిగే సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీఆర్ఎస్లో మూడు నెలల్లో పరిష్కారమయ్యే సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా నెలలోనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జనసేన నాయకులు యాల్లటూరు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.



