కడప: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పుబట్టారు. పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు లోకేష్ అంగీకరించారని ఆరోపించారు.
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పీవీ సింధు, శ్రీచరణి వంటి క్రీడాకారులతో డీఎస్సీ అభ్యర్థులను పోల్చడం సరికాదన్నారు. క్రీడా సంఘాల హోదాలో టీడీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సర్టిఫికెట్లు జారీ చేశారన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు.
జీవో 44, 47, 74ల అమలు విషయంలో స్పష్టత ఇవ్వాలని, డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలని కోరారు.



